
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజి ప్రకటించింది. ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. నష్టాల్లో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్. ఐ. ఎన్. ఎల్) పరిశ్రమను కాపాడేందుకు 11,440 కోట్ల రూపాయల ప్యాకేజి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కమిటీ ప్యాకేజికి ఆమోద ముద్ర వేసిందని తెలిపారు.
గత కొద్ది సంవత్సరాలుగా విశాఖ ఉక్కు పరిశ్రమ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి, సంస్థ నడపడానికి మూలధనం లేకపోవడంతో కేంద్రం సంస్థను ప్రయివేటీకరణ చేస్తుందని ఊహాగానాలు ఏర్పడ్డాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో NDA ప్రభుత్వం ఏర్పడడంతో స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు సానుకూల వాతావరణం ఏర్పడింది. ముఖ్యమంతి చంద్రబాబు, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి పలు మార్లు చర్చలు జరిపారు. చివరగా పరిశ్రమను ఆదుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ప్యాకేజిలోని 10,300 కోట్ల రూపాయలు పరిశ్రమలో ఈక్విటీ పెట్టుబడిగా మరియు రూ. 1,140 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ లోన్‌ను 7 శాతం నాన్-క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్‌గా మార్చడం కోసం ఉపయోగిస్తారు. ఈ పెట్టుబడి ద్వారా ఇప్పటికే ఉన్న రుణాలు తీర్చడం మరియు ఉక్కు ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఫర్నేస్, మెషినరీలను ఆధునీకరించడానికి, ఉత్పాదకత పెంపునకు వినియోగిస్తారు. ఈ పునరుద్ధరణ ప్యాకేజీతో, RINL ఎదుర్కొన్న కాలానుగుణ అనేక సమస్యలు పరిష్కరించబడతాయని సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.